రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అవసరమైతే మరిన్ని నిధులను సమకూరుస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.
అన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గత తప్పులను సరిదిద్దుకుంటూ, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చుతామని ఆయన స్పష్టం చేశారు.
గత 27 నెలల కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీ రూపంలో పేదల వైద్యానికి అత్యధికంగా నిధులు వెచ్చించినట్లు ముఖ్యమంత్రి శాసనసభలో గణాంకాలను వివరించారు. మొత్తం 4,500 కోట్ల రూపాయలు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సర్వే ప్రకారం 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పేదల్లో ధీమా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వం నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీలో వారసత్వంగా వచ్చిన ₹600.27 కోట్ల బకాయిని భరిస్తూనే, ఆరోగ్యశ్రీ పరిమితిని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం అత్యాధునికంగా వైద్యం అందించేలా 10 వేల పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు.











