రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను పెంచే లక్ష్యంతో, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ఈ ప్రాజెక్టు అమలుపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని 64 ప్రభుత్వ వైద్యశాలల్లో రోగుల ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. రోగి వైద్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేయడం ద్వారా వైద్యులు తక్షణమే సరైన చికిత్స అందించడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ డిజిటల్ హెల్త్ కార్డు వ్యవస్థ, ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వివిధ రకాల వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి, అవసరమైన వారికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయితే, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


