ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో 'హెల్త్ వీక్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.
జిల్లాలో ఆరోగ్య సేవల బలోపేతం మరియు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపు లక్ష్యంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు 'హెల్త్ వీక్' నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డ్రగ్స్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ అధికారులు, మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. హెల్త్ వీక్ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, జిల్లా స్థాయి కార్యాచరణ, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలపై సమీక్షించి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ర్యాలీలను విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం కల్పించాలని సూచించారు.
హెల్త్ వీక్లో భాగంగా రోజువారీగా ఆహార భద్రత, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, సురక్షిత తల్లి దినం, ఎయిడ్స్ అవగాహన, హోమియోపతి, ఆయుష్ దినం, ఔషధ నియంత్రణ బలోపేత దినం వంటి అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు నిర్వహించిన కార్యక్రమాలపై ఫోటోలు, వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కోరారు.












