ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డిలో శుక్రవారం ఉదయం యోగా కార్యక్రమాలు, ఆయుష్ ఆరోగ్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, అవగాహన కల్పించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.వసంత్ రావు యోగా కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఉదయం 6:30 నుండి 7:30 గంటల వరకు యోగా సెషన్ జరిగింది.
అనంతరం, అదనపు కలెక్టర్ పాండు ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ భవనంలో ఆయుష్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో యునాని, హోమియోపతి, ఆయుర్వేద వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు.
శిబిరంలో రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయిలు (షుగర్) వంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
దీర్ఘకాలిక వ్యాధులకు సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రత్యామ్నాయ వైద్య విధానాలైన యునాని, ఆయుర్వేద, హోమియోపతి చికిత్సల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వైద్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.











