ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి, స్పష్టమైన పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్ నుండి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లతో ప్రి–ఎస్.ఐ.ఆర్ పురోగతిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రం వారీగా పురోగతిని పరిశీలించిన కలెక్టర్, పనితీరులో వెనుకబడి ఉన్న ఆయా ఏఈఆర్ఓలను కారణాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 51.96 శాతం మాత్రమే ఓటర్ మ్యాపింగ్ పూర్తయిందని, ప్రత్యేకంగా అర్బన్ సెగ్మెంట్లో పురోగతి తక్కువగా ఉన్నందున డోర్ టు డోర్ సందర్శనల ద్వారా ఓటర్ మ్యాపింగ్ వేగవంతం చేసి, పది రోజుల్లో కనీసం 85 శాతం పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఈఆర్ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
తక్కువ పురోగతి ఉన్న బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లతో చర్చించి సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఏఈఆర్ఓలు వారం రోజుల పాటు ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో ఆకస్మిక క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, రోజువారీ సమీక్ష చేయాలని స్పష్టం చేశారు. పని తీరు సంతృప్తికరంగా లేని బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓటర్ మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్తగా విలీనం అయిన ప్రాంతాలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్కు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.


