సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం వట్పల్లి పోలీస్ స్టేషన్, జోగిపేట సర్కిల్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.
ఎస్పీ పరితోష్ పంకజ్ వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణను సమీక్షించారు. సిబ్బందికి అందించిన కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి, వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
ఆస్తి సంబంధిత నేరాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను 'బ్లాక్ స్పాట్లు'గా గుర్తించి, బీట్ విధులలో నిఘా పెంచాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించాలని తెలిపారు. విలేజ్ పోలీసు అధికారులు తమ గ్రామాలపై అవగాహన కలిగి ఉండాలని, శాంతి భద్రతలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, పాపిలాన్ డివైస్ ద్వారా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను తనిఖీ చేసి, పాత నేరస్తులను గుర్తించాలని ఆదేశించారు. సీసీటీఎన్ఎస్-2.0, టీఎస్-కాప్ వంటి వివిధ సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై అవగాహన సాధించి, నేరాల నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ రికార్డులను సీసీటీఎన్ఎస్-2.0లో నమోదు చేయాలని, సిబ్బందికి విధులు కేటాయించాలని సూచించారు.
జోగిపేట సర్కిల్ కార్యాలయంలో రికార్డుల నిర్వహణను పరిశీలించి, పెండింగ్ కేసుల ఛేదన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సిబ్బందిని ప్రోత్సహించారు. వ్యక్తిగత సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.












