చిన్నపిల్లల పానీయాల తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా ప్యాకేజింగ్ మోసపూరితమని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక, పుదుచ్చేరి ప్రభుత్వాలు, FSSAI లకు నోటీసులు జారీ చేసింది.
చిన్నపిల్లలు తాగే పండ్ల రసాలు, పాల ఉత్పత్తుల వంటి టెట్రా ప్యాకెట్లలో వోడ్కా, ఇతర మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా ప్యాకేజింగ్ మోసపూరితమని పేర్కొంది. ఈ విషయంలో తక్షణ స్పందన అవసరమని భావించిన దేశ సర్వోన్నత ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లకు నోటీసులు జారీ చేసింది.
కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో టెట్రా ప్యాకెట్లలో వోడ్కా, మద్యం అమ్మకాలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. టెట్రా ప్యాకింగ్ సాధారణంగా పిల్లలు తాగే పానీయాలకు ఉపయోగిస్తారని, అదే ప్యాకింగ్‌లో మద్యం అమ్మితే అమాయక పిల్లలు, చదువుకోని వారు పొరపాటున తాగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మద్యం వ్యాపారులు ఖర్చు తగ్గించుకోవడానికి, రవాణా సౌలభ్యం కోసం గాజు సీసాలకు బదులుగా టెట్రా ప్యాక్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. దీనివల్ల 180 ml వోడ్కా కేవలం రూ.50-60కే లభిస్తుందని, తక్కువ ధరకు దొరకడం వల్ల యువత, విద్యార్థులు, పేదలు మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇలాంటి మోసపూరిత అమ్మకాలు ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు తెస్తాయని భావించింది. ఈ విధానాన్ని ఎందుకు నివారించకూడదో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.











