పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, SERP సీఈఓ దివ్యతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, నరేగా పనులు, చేయూత పెన్షన్ సర్వేల పురోగతిని సమీక్షించారు. ఈ పనులను అత్యంత ప్రాధాన్యంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్లో, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ ఉపాధి హామీ పథకం (NAREGA) కింద వేజ్ కంపోనెంట్, మెటీరియల్ కంపోనెంట్ పనులను వేగవంతం చేయాలని, ప్రణాళికలో ఉన్న అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. నరేగా పథకం జూన్ 30 వరకు కొనసాగుతుందని, జూలై 1 నుంచి కొత్తగా వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రానుందని తెలిపారు.
ప్రస్తుతం రోజుకు 15 లక్షల మంది కార్మికులు నరేగా పనుల్లో పాల్గొంటుండగా, వెంటనే ఆ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని సూచించారు. ప్రతి రోజు పనుల కోసం ముందురోజే కార్మికుల సమీకరణ చేపట్టాలని, పనులు గ్రామ హాబిటేషన్ పరిధిలోనే ఉండేలా చూడాలని తెలిపారు. ఉదయం 5.30 గంటలకే పనులు ప్రారంభించి, ప్రధాన పనులను ఉదయం 10.30 గంటలలోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రి సుమారు 8 వేల మహిళా గ్రామ సంఘ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో రాబోయే 40 రోజుల్లో ఎక్కువ సంఖ్యలో భవన పనులను బుక్ చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడలు, మహిళా సంఘాల భవనాలు వంటి నిర్మాణాలను నరేగా కింద ప్రణాళిక చేయవచ్చని తెలిపారు.
చేయూత పెన్షన్ల సర్వేపై మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 41 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని, అందులో పోస్టల్ శాఖ ద్వారా 21 లక్షల మందికి నగదు రూపంలో పెన్షన్ పంపిణీ జరుగుతోందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మరో 20 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్ జమ అవుతోందన్నారు. ఫేస్ రికగ్నిషన్ విధానం అమలుతో మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన లబ్ధిదారుల కారణంగా ఇప్పటికే సుమారు 20 వేల పెన్షన్లు తగ్గినట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులందరికీ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా చనిపోయిన లబ్ధిదారులను ఖచ్చితంగా గుర్తించడం జరుగుతుందని తెలిపారు.












