తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, తొలిసారిగా సభను ఉద్దేశించి ప్రసంగించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్, తన ప్రభుత్వం డ్రగ్స్‌పై నేటి నుంచే పోరాటం ప్రారంభిస్తుందని ప్రకటించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్, తన ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. తాను రాజకీయాల్లోకి రావడానికి అభిమానుల ప్రోత్సాహమే కారణమని, ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు. "ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభం" అని ఆయన అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ, తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని, సాధ్యాసాధ్యాలను బట్టి మాత్రమే ముందుకు వెళ్తామని, లక్ష్యాలను సాధిస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
"దిస్ ఈజ్ న్యూ బిగినింగ్. ప్రజా ధనాన్ని వృథా చేయను.. దోచుకోను. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉంది.. అది విజయ్ మాత్రమే. నేను పవర్ సెంటర్.. మరో పవర్ సెంటర్ ఉండదు.. ఉండబోదు" అని విజయ్ స్పష్టం చేశారు. మైనారిటీ ప్రజలకు, విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ప్రభువ ఏర్పాటుకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన విజయ్, కార్యకర్తల కృషే ఈ విజయానికి కారణమని కొనియాడారు. "మిత్రువులైనా, శత్రువులైనా.. అందరికీ ఒకే చట్టం" అని ఆయన పేర్కొన్నారు.









