మనూర్ మండలంలోని అతిమ్యాల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మహేశ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత జర్నలిస్టు ఫోరం (డీజేఎఫ్) నాయకులు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ కు ఫిర్యాదు చేశారు. గతంలో వార్త సేకరణకు వెళ్లిన రిపోర్టర్ పై దాడి జరిగిందని ఆరోపణలున్నాయి.
దళిత జర్నలిస్టు ఫోరం (డీజేఎఫ్) నాయకులు శుక్రవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత మార్చి 17న అతిమ్యాల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మహేశ్ కుమార్, వార్త సేకరణకు వెళ్లిన రిపోర్టర్ రాములుపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ దాడిలో ఉపాధ్యాయుడికి సహకరించిన కొందరు గ్రామస్థులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫోరం నాయకులు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఫోరం అధ్యక్షుడు రాపాక విజయరాజు తెలిపారు.
సమాజంలో నిజాలను నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టులపై దాడులు జరగడం ఆందోళనకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీని కోరారు. జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దత్తు రెడ్డి, జర్నలిస్టు సాయిలు, దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.












