భారతదేశ ప్రతిష్టాత్మక తేజస్ యుద్ధ విమానాల ప్రాజెక్టుకు అవసరమైన ఇంజిన్ల సరఫరాలో జాప్యం చేస్తున్న అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్పై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) భారీ జరిమానాలు విధించేందుకు నిర్ణయించింది. ఈ చర్యలు భారత రక్షణ రంగంలో కీలక పరిణామంగా పరిగణించబడుతున్నాయి.
స్వదేశీ తేజస్ Mk1A యుద్ధ విమానాల కోసం ఉద్దేశించిన ఇంజిన్ల సరఫరాలో జీఈ ఏరోస్పేస్ కాలయాపన చేస్తోందని, దీనికి ప్రతిగా నష్టపరిహారం వసూలు చేస్తామని హెచ్ఏఎల్ సీఎండీ తెలిపారు. ఒప్పందం ప్రకారం, 2024 నుంచి ఏటా 20కి పైగా ఇంజిన్లను డెలివరీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 6 ఇంజిన్లు మాత్రమే అందినట్లు సమాచారం.
సప్లై చైన్ సమస్యలను సాకుగా చూపుతున్న జీఈ ఏరోస్పేస్ వాదనను భారత్ అంగీకరించడం లేదు. రెండవ బ్యాచ్ కోసం 113 ఇంజిన్ల కొనుగోలుకు సంబంధించిన 1 బిలియన్ డాలర్ల ఒప్పందంపై కూడా ఈ జరిమానా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పరిణామం అంతర్జాతీయ సరఫరాదారులపై ఒత్తిడి పెంచుతుందని భావిస్తున్నారు.
ఇంజిన్ల కొరత కారణంగా తేజస్ Mk1A ప్రాజెక్ట్ దాదాపు రెండేళ్లు ఆలస్యమైంది. ఈ ప్రాజెక్ట్ కింద భారత వైమానిక దళం 180 విమానాలను ఆర్డర్ చేసింది. ప్రస్తుతం 18 విమానాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇంజిన్ల లభ్యత లేకపోవడంతో వాటి అసెంబ్లీ నిలిచిపోయింది. దేశ రక్షణ సన్నద్ధత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.











