తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నూతన చైర్మన్గా బసవరాజ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా పొన్నాడ సుబ్రమణ్య ప్రసాద్ సోమవారం హైదరాబాద్లోని వసంత్ విహార్ ఫంక్షన్ హాల్లో తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన బసవరాజ శ్రీనివాస్, పొన్నాడ సుబ్రమణ్య ప్రసాద్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి, పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం తదితరులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా, డా. సత్యం శ్రీరంగం మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధికి తోడుగా ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తారని తెలిపారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వం నుంచి నిధులను సాధించాలని నూతన బాధ్యతల్లో ఉన్నవారికి సూచించారు. సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










