వేసవి కాలంలో తాగునీటి కొరత ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి నివాస ప్రాంతానికి నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంచినీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, పారిశుధ్యం, సాదా బైనామాలు, భూభారతి దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలపై లోతుగా చర్చించారు.
మండలాల వారీగా గ్రామాల్లో నీటి సరఫరా పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, మరమ్మతులు అవసరమైన పనులపై కలెక్టర్ ఆరా తీశారు. గత వేసవిలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలను గుర్తించి, ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి వృథాను అరికట్టి, సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు.
ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలని, గ్రామ పంచాయతీ పరిధిని స్పష్టంగా తెలిపేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.












