రాష్ట్ర పోలీసు శాఖలో అవినీతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
పోలీసు యూనిఫామ్ ధరించినప్పుడు అవినీతి ఆలోచనలకు తావు ఉండరాదని, శాంతిభద్రతల పరిరక్షణలో నిజాయితీగా వ్యవహరించాలని డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు సిబ్బందిని ఆదేశించారు. అక్రమ సంపాదనకు పాల్పడేవారిపై ACB కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇటీవల కాలంలో కొందరు పోలీసు సిబ్బంది ACB దాడుల్లో పట్టుబడటం పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని డీజీపీ అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
లంచం తీసుకునేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎవరూ చట్టాన్ని అతిక్రమించవద్దని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు భరోసా కల్పించేలా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఆయన సిబ్బందికి సూచనలు చేశారు.
పోలీసుల కర్తవ్యం 'ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్'గా ఉండాలని, ఈ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని డీజీపీ పిలుపునిచ్చారు.











