తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అవతరణ దినోత్సవం (జూన్ 2) తర్వాత ఈ ధరల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో విక్రయిస్తున్న అన్ని రకాల మద్యం బ్రాండ్లపై కనీసం 10 శాతం నుంచి 15 శాతం వరకు ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంధన ధరలు పెరిగాయి. దీని కారణంగా మద్యం సీసాల తయారీకి అవసరమైన ఎల్పీజీ, సహజ వాయువు లభ్యతపై ప్రభావం పడింది. ఇది ఉత్పత్తి వ్యయాన్ని పెంచింది. గ్లాస్ బాటిళ్లు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
పెరిగిన ఉత్పత్తి వ్యయాల కారణంగా తాము నష్టపోతున్నామని, ధరలను సవరించాలని డిస్టిలరీలు, బ్రేవరీస్ కంపెనీలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను భర్తీ చేయడానికి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం ధరల పెంపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.










