తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇన్చార్జ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి పదవీ విరమణ నేపథ్యంలో, మే మొదటి వారంలో ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ నియామకం, ఆయన దశాబ్దాల పాటు పోలీస్ శాఖలో చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నారు. ఆయన క్రీడా రంగంలోనూ, విద్యా రంగంలోనూ విశేష ప్రతిభ కనబరిచారు. అండర్-19 భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్గా తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఐపీఎస్ సాధించారు.
పోలీస్ అధికారిగా సీవీ ఆనంద్ తన విధి నిర్వహణలో సమర్థతను, నిజాయితీని ప్రదర్శించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా, సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. సున్నితమైన పరిస్థితుల్లో శాంతిభద్రతలను కాపాడటంలో, నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించారు. డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ఆయన వినూత్న ఆలోచనలకు నిదర్శనం.
యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపారు. ఆయన సేవలకు గాను పోలీస్ మెడల్ ఫర్ గాల్లంట్రీ, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. సీవీ ఆనంద్ కుటుంబం కూడా విద్యా, క్రీడా రంగాల్లో రాణించింది. ఆయన సతీమణి లలితా ఆనంద్ ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్డీ పూర్తి చేయగా, కుమారుడు ప్రొఫెషనల్ క్రికెటర్‌గా గుర్తింపు పొందారు.










