తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం అర్ధరాత్రి నుంచి కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెకు దిగారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
సమ్మె కారణంగా పెద్దపల్లిలో 150 బస్సులు, మహబూబ్‌నగర్‌లో 112 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్‌నగర్‌లో 16 విద్యుత్ బస్సులను అధికారులు నడిపిస్తున్నారు.
డిపోల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ, కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమస్యలను దశలవారీగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.











