తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పలువురు సభ్యులను నియమించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ చట్టం–1991 ప్రకారం ద్వితీయ శ్రేణి సభ్యులతో కూడిన ఈ మండలికి కొత్తగా సభ్యులను నియమించారు. నామినేటెడ్ కోటాలో భాగంగా బిజినెస్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఆంజనేయులు, జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డా. సుధాకర్ గౌడ్లను ఎంపిక చేశారు.
అఫిలియేటెడ్ కళాశాలల తరపున గౌతమి కళాశాల ప్రిన్సిపాల్ డా. కే. సంజీవరావు, గిరిరాజ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ దండు స్వామి, ఇందూర్ పీజీ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్కు చెందిన ప్రొఫెసర్ మదన్ మోహన్‌లను నియమించారు.
విశ్వవిద్యాలయ పరిధిలోని వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, విద్య మరియు సామాజిక రంగాల్లో నిష్ణాతుల కేటగిరిలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ చెరుకూరి రజనీకాంత్‌కు స్థానం కల్పించారు. జర్నలిస్ట్ మహమ్మద్ ఘాజీ, డా. ఎస్. జయంత్‌లు కూడా సభ్యులుగా నియమితులయ్యారు.
ఈ నియామకాలతో విశ్వవిద్యాలయ పాలక మండలి కార్యకలాపాలు మరింత విస్తృతం కానున్నాయని భావిస్తున్నారు.












