అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను 'తుపానుకు ముందు ప్రశాంతత'గా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ఒక చిత్రాన్ని పంచుకున్నారు.
ఈ చిత్రంలో సముద్రంలో యుద్ధ నౌకలు, యూఎస్ నేవీ అడ్మిరల్, ఆయన ముందు తాను ఉన్నట్లుగా ఒక కృత్రిమ మేధస్సు (AI) రూపొందించిన చిత్రం ఉంది. ఈ చిత్రంలో కొన్ని ఇరాన్ నౌకలు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించాయి. అమెరికా అధ్యక్షుడు అనుమతిస్తే ఇరాన్‌పై దాడులకు సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ ఏర్పాట్లు చేసుకుంటోందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ ఈ పోస్టు చేశారు.
తమతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ త్వరగా కుదుర్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందంతో ఇరాన్‌కే ప్రయోజనం చేకూరుతుందని అంతకుముందు ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ, అమెరికా సందేశాలు తమకు అందాయని, చర్చలకు అమెరికా కూడా సుముఖంగా ఉందని తెలిపారు. అయితే, అమెరికాపై తమకున్న అపనమ్మకం పూర్తిగా తొలగిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 8న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని, దీనిపై అంతటా ఆందోళన నెలకొందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
అణ్వాయుధాల అభివృద్ధి, హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ వంటి విషయాల్లో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని కథనాలు వెలువడ్డాయి.











