ఆత్మస్థైర్యం, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతో మంది దివ్యాంగులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని సంజీవ్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ సమగ్ర శిక్ష, ఏఎల్ఎంఐసీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, దివ్యాంగ విద్యార్థులకు వినికిడి పరికరాలు, వీల్చైర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు. దివ్యాంగులు పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించగలరని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనితా సంతోష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆర్. కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు సంగీతా మహేష్, యశోద, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.











