మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్లో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన గావించి ఘన నివాళులు అర్పించారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి తదితరులు కూడా పాల్గొని నివాళులర్పించారు.
అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ దళితులు, గిరిజనులు మరియు వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించిన మహనీయుడని కొనియాడారు. ఆయన విగ్రహాలను నెలకొల్పడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలని సూచించారు. రిజర్వేషన్ల ద్వారా బడుగు, బలహీన వర్గాలు ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నాయని, కులమత భేదాలను తొలగించి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా సంఘాల నాయకులు కృషి చేయాలని సూచించిన అనంతరం, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రోత్సాహక చెక్కులను పంపిణీ చేశారు. దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘దళిత రత్న’ అవార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీఓ రాజేష్ కుమార్, ఏసీపీ వెంకట్ రెడ్డి, ఉప్పల్ తహసీల్దార్ పూల్ సింగ్, డీఆర్డీఓ సాంబశివరావు, ఎల్డీఎం శివప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి పద్మజ, వివిధ కుల సంఘాల నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. టి.ఎస్.ఎస్ కళాకారులు ఆలపించిన గీతాలు సభను ఆకట్టుకున్నాయి.











