విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్తీషియా పీజీ విద్యార్థిని భత్తుల దీపిక అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారించారు. ఈ కేసులో దీపిక సీనియర్ అయిన డాక్టర్ అమర్ సహసి రెడ్డిని అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన దీపిక, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో అనస్తీషియా విభాగంలో పీజీ చివరి సంవత్సరం చదువుతోంది. గత నెల 5వ తేదీ అర్ధరాత్రి ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఆపరేషన్ థియేటర్లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో, హైదరాబాద్‌కు చెందిన అమర్ సహసి రెడ్డితో దీపికకు ఏడాది కాలంగా పరిచయం ఉందని, ఇద్దరూ ప్రేమించుకున్నారని వెలుగులోకి వచ్చింది. అయితే, అమర్ తన పాత బ్యాచ్‌మేట్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో దీపికను దూరం పెట్టడం ప్రారంభించినట్లు తెలిపారు. దీపిక మరణించిన రోజు రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్లో, అమర్ తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని, నిన్ను వివాహం చేసుకోలేనని తెగేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
అమర్ మాటలతో మనస్తాపానికి గురైన దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. రోగులకు మత్తు ఇచ్చేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేక ఇంజెక్షన్‌ను స్వయంగా తీసుకోవడం వల్లే దీపిక మరణించినట్లు ఫారెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది. దీపికను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను అమర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్‌కు తరలించారు.

