తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ నిర్ణయం పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా, వ్యూహాత్మక నాయకుడిగా పేరుగాంచిన వేం నరేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఢిల్లీ దాకా విస్తరించింది.
శాసనసభ ఎన్నికల సమయంలో చేవెళ్ల, మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన వేం నరేందర్ రెడ్డి, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరు అధిష్టానం దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం పలువురు ఆశావహులు పోటీలో ఉన్నప్పటికీ, చివరికి వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేయడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకున్న ప్రాధాన్యత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించాయని సమాచారం.
ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీ పార్లమెంట్‌కు వేం నరేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని అనిల్ కుమార్ యాదవ్ అభివర్ణించారు.

