ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లాలో విద్యా వారోత్సవాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ప్రారంభించారు. పాల్వంచ మండలం భవానిపేట్ తాండాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను కలెక్టర్ వివరించారు.
పాల్వంచ మండలం భవానిపేట్ తాండాలోని కేజీబీవీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే సమ్మర్ క్యాంప్ మే 11 నుండి 25 వరకు కొనసాగుతుందని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులవ్వాలని ఆయన అన్నారు.
విద్యార్థులు నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్య వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధికి దోహదపడాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు, బోధన అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన వివరించారు. విద్యా వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు.
కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జయరాజ్, తాసిల్దార్ జనార్ధన్, డిఎల్పిఓ శ్రీనివాస్, ప్రిన్సిపల్ మహిషా, డెకో సుకన్య, సంబంధిత అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.










