దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మరో ఆరుగురు నిందితులను కొత్తపేట పోలీసులు నేటి నుంచి ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఈ నిందితులను మధ్యాహ్నం విజయవాడకు తరలించారు.
విజయవాడ సీజేఎం కోర్టు పోలీసులకు ఈ నెల 13వ తేదీ వరకు నిందితులను విచారించేందుకు అనుమతి మంజూరు చేసింది. అంతకుముందు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఐదుగురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తాజా విచారణకు రంగం సిద్ధమైంది. వారి స్టేట్మెంట్ల నుంచి కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కస్టడీలోకి తీసుకోనున్న నిందితుల్లో బిహార్‌కు చెందిన షాద్మాన్ దిల్కష్ (A4), ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ (A7), రాజస్థాన్‌కు చెందిన జిషాన్ (A9), పశ్చిమ బెంగాల్‌కు చెందిన మీర్ ఆసిఫ్ అలీ (A10), పుణెకు చెందిన షారుక్ ఖాన్ (A12), మహారాష్ట్రకు చెందిన షేక్ ఫయాజ్ రెహమాన్ (A13) ఉన్నారు.
ఈ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు కాగా, పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు. మిగిలిన నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు. తాజా కస్టడీ విచారణతో కేసు పురోగతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.











