సంగారెడ్డి, జూలై 31
ఆగస్టు 1 నుంచి 7 వరకు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా, ప్రతి తల్లి తమ శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలని జిల్లా శిశు, సంక్షేమ అధికారి లలిత కుమారి పిలుపునిచ్చారు. పుట్టిన వెంటనే వచ్చే తొలి పాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆమె తెలిపారు.
ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి తల్లి తన శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలని జిల్లా శిశు, సంక్షేమ అధికారి లలిత కుమారి కోరారు.
శుక్రవారం ఆమె మాట్లాడుతూ, పుట్టిన వెంటనే వచ్చే తొలి పాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంచే అమూల్యమైన ఆహారమని తెలిపారు. మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయని, విరేచనాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు.
తల్లిపాలు శిశువు శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడటంతో పాటు తల్లి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది "జీవితానికి స్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు – ఇప్పటికే ఫలితాలిస్తున్న చర్యలను మరింత బలోపేతం చేద్దాం" అనే అంశంతో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి బాలింతలకు అవసరమైన సహకారం అందించాలని, ఆరోగ్యవంతమైన భావితరాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లలిత కుమారి విజ్ఞప్తి చేశారు.












