ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీకి కలిసి వచ్చేదెంత.?
రాజకీయాల్లో చేరికలు, కూడికలు కామనే. వీటికి కూడా సమయం, సందర్భం ఉంటుంది. అయితే ఎలాంటి సందర్భం లేకుండానే తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికతో భవిష్యత్తులో భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశంపై కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత తీవ్రం చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.
గ్రామీణ స్థాయి: గ్రామీణ స్థాయిలో బీజేపీ వీక్‌గా ఉంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నాళ్లయినా కమలనాథులు జెండా కట్టే పరిస్థితి, పట్టే పరిస్థితి కూడా లేదు. నాయకులు కూడా నగరాలపైనే ఫోకస్ చేయడంతో గ్రామీణ బీజేపీలో పెద్దగా ఉలుకు పలుకు లేదు. ఈ నేపధ్యంలో గ్రామీణ తెలంగాణలో బీజేపీని పుంజుకునేలా చేయాలన్నది రాంచందర్‌రావు ఆలోచన. దీంతో గ్రామీణ స్థాయిలో పార్టీని పరుగు పెట్టించాలనే భావనతో ఉన్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి నుంచి ప్రారంభించి ఆదిలాబాద్ వరకు ఆకర్ష్ మంత్రాన్ని జపించనున్నారు.
యువతకు పెద్దపీట: బీజేపీలో యువతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల వరకు కూడా బీజేపీ యువతను ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు రాంచందర్‌రావు కూడా బీజేపీ పెద్దలు వేసిన బాటలోనే నడవనున్నారు. యువతకు అవకాశం ఇవ్వడంతో పాటు పార్టీలో పదవులు కూడా వారికే ఇవ్వాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దీనివల్ల అనతి కాలంలోనే పార్టీ పుంజుకుంటుందన్న భావనతో ఉన్నారు. ఇది కూడా యువతను ఆకర్షించేందుకు ప్రధాన కారణంగా మారింది.
పార్టీలకు అతీతంగా: బీజేపీని పుంజుకునేలా చేయడంలో ఏ పార్టీకి చెందిన వారినైనా చేర్చుకునేందుకు రాంచందర్‌రావు సిద్ధమయ్యారు. కేవలం కొన్ని పార్టీలకు చెందిన వారినే చేర్చుకుంటామనే భావన విడిచిపెట్టి అన్ని పార్టీలకు చెందిన వారిని వస్తామంటే వద్దంటామా అన్న ఫార్ములాతో ఆకర్షించేందుకు సిద్ధమయ్యారు. ఇది కూడా బీజేపీకి మంచి ఊతం ఇస్తుందన్న ఆలోచనతో ఉన్నారు.
మొత్తానికి రాంచందర్‌రావు వ్యూహం ఏమేరకు బీజేపీని పరుగులు పెట్టిస్తుందో చూడాలి.