ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో, అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత పొందింది. కేంద్ర న్యాయశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ చారిత్రక పరిణామంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేశారు.
"అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి మా కలను సాకారం చేశారు" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి అండగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ బిల్లుకు మద్దతు పలికిన ఎంపీలు, రాష్ట్ర నాయకులు, ఉద్యమంలో అండగా నిలిచిన ప్రతి పౌరుడికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం అని ఆయన తన పోస్టులో ఉద్ఘాటించారు.







