ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కె.రఘురామ కృష్ణ రాజుపై, ఆయన రాజ్యాంగ పదవిలో ఉండి కూడా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ టీవీ చర్చల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె.విజయనంద్కు లేఖ పంపిన రాష్ట్రపతి కార్యాలయం, ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ జనరల్ సెక్రటరీ పి.సురేష్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు వెలువడ్డాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ కార్యకలాపాలు, టీవీ చర్చల్లో పాల్గొనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. మొదటి ఫిర్యాదుకు స్పందన రాకపోవడంతో సురేష్ కుమార్ మరోసారి రాష్ట్రపతి కార్యాలయాన్ని ఆశ్రయించగా, ఈసారి అధికారులు స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రపతి కార్యాలయం లేఖలో "పిటిషనర్ ఫిర్యాదు మేరకు విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి" అని స్పష్టంగా ఆదేశించింది. ముఖ్య కార్యదర్శి విచారణ నివేదికను రాష్ట్రపతి కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. రఘురామ కృష్ణ రాజు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొంది, శాసనసభ ఉపస్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గతంలో పలు పార్టీలు మారిన చరిత్ర ఉన్న ఆయన, సూటి వ్యాఖ్యలు చేయడంలో, టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొనడంలో ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో, రాజ్యాంగ పదవి నిష్పాక్షికతను కాపాడాలనే డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ స్రావణ్ కుమార్ మాట్లాడుతూ, "స్పీకర్ లేదా ఉపస్పీకర్ పదవి స్వీకరించిన వ్యక్తి పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ రఘురామ కృష్ణ రాజు టీవీ డిబేట్ల్లో పాల్గొనడం రాజ్యాంగ సంప్రదాయాల ఉల్లంఘన" అని విమర్శించారు.
రాజ్యాంగ కర్తవ్యాలు నిర్వర్తిస్తున్న వారు రాజకీయ ప్రచారం, వ్యాఖ్యలు చేయకూడదని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తెలిపారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ పరిణామం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజ్యాంగ పదవులు నిర్వర్తిస్తున్న నాయకులు రాజకీయ గొడవలు, వ్యాఖ్యలు చేయడం సరైనదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.











