నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం పరిధిలోని అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం కూల్చివేతకు నిరసనగా, బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు శుక్రవారం 'ధర్మాగ్రహ దీక్ష'ను ప్రారంభించారు. కూల్చివేసిన స్థలంలోనే శివాలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, 700 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేయడం హిందూ సమాజ మనోభావాలపై దాడిగా అభివర్ణించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, కూల్చిన స్థలంలోనే నిధులు విడుదల చేసి ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు పనులు ప్రారంభించే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా దీక్షా స్థలంలో వేద పండితులచే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. పండితులు వేద మంత్రాలతో, గంగాజలంతో ప్రాంగణాన్ని శుద్ధి చేసి, శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. "హర హర మహాదేవ", "జై శ్రీరామ్" నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
స్థానిక భక్తులు, శివభక్త సంఘాలు, హిందూ ఐక్య వేదిక, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డికి సంఘీభావం తెలిపారు.
కూల్చివేసిన కాంట్రాక్టర్, JCB డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేవరకు తమ పోరాటం ఆగదని నిరసనకారులు స్పష్టం చేశారు.











