ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 'అభినవ గోబెల్స్' అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. అబద్దాలు, మోసాలతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని, మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. మహిళా బిల్లును అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని బండి సంజయ్ ఆరోపించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 'అభినవ గోబెల్స్' అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. అబద్దాలు, మోసాల పునాదులపైనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, మహిళలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. మహిళలకు ప్రతినెలా రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదని బండి సంజయ్ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే దొంగ హామీలు, పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెడితే, ఇండీ కూటమి నేతలు, అందులో భాగంగా రేవంత్ రెడ్డి బిల్లును అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టం జరగబోతోందని తప్పుడు ప్రచారాలు చేసి, ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగకుండా కుట్రలు చేశారని ఆయన అన్నారు.
జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే మోదీ ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచడం ద్వారా దక్షిణాదికి మేలు చేయాలని నిర్ణయించిందని, అయితే ఇండీ కూటమి పేరుతో కాంగ్రెస్ నేతలు దీనిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ఇండీ కూటమి నేతలు దక్షిణాదికి ఉన్న అవకాశాలకు గండికొట్టారని, తీరని నష్టం చేశారని బండి సంజయ్ అన్నారు. మహిళలంతా ఏకమై రేవంత్ రెడ్డి సర్కార్ ను గద్దె దించడం తథ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతోందని తెలిపారు.










