తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లపై తీవ్ర ఆరోపణలు చేశారు. బాలానగర్ లో వందల కోట్ల విలువైన భూమిని అక్రమంగా బదలాయించుకున్నారని, దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని బాలానగర్ లో వందల కోట్ల విలువైన భూమిని సేల్ డీడ్ లేకుండా కంపెనీ యజమానులను బెదిరించి, దౌర్జన్యంగా భూ బదలాయింపు చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నామని, హరీష్ రావు, కేటీఆర్, వెంకటరమణ రెడ్డి దీనికి అంగీకరిస్తే వెంటనే భూమిపై విచారణ కమిటీ వేస్తామని తెలిపారు.
బాలానగర్ లో జరిగిన భూ కబ్జా విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సంప్రదించినా సహకరించలేదని, ఇప్పుడు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని, దీనిపై పూర్తి నివేదిక తయారు చేస్తున్నామని కరాఖండిగా చెప్పడంతో, అప్పటినుండి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని తెలిపారు.
హరీష్ రావు, కేటీఆర్ లు కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించి రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారిండ్రు అని ముఖ్యమంత్రి ఆరోపించారు. వారికి కేవలం రాజకీయాలే కావాలని, ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారం సేకరించి, పూర్తి నివేదికను త్వరలో వెల్లడిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.










