తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ ఎదుగుదలకు దోహదపడ్డారని, ఆయన లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కావని అన్నారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని ఆయన ఉదాహరించారు.
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా, కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారనే మాటలను ప్రస్తావిస్తూ, ఆయనను గృహ నిర్బంధం చేశారనే అనుమానం తనకు ఉందని సీఎం తెలిపారు. రాజకీయ పార్టీల సమస్య కాకుండా, ఇది దక్షిణ భారతదేశం మరియు ప్రజల సమస్య అని ఆయన నొక్కి చెప్పారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నియోజకవర్గాల పునర్విభజనపై చేస్తున్న వ్యాఖ్యలను సీఎం తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని ఆయన అనడం సరికాదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.
నియోజకవర్గాల పునర్విభజన 50 శాతం సీట్ల ప్రాతిపదికన జరిగితే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బ్రూటల్ మెజార్టీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై బీజేపీ నాయకులు అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. బాగా పని చేస్తున్న దక్షిణ భారతదేశాన్ని శిక్షించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. త్వరలో తాను కేరళలో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరికీ త్వరలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. పంట మార్పిడి విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకురామని, వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. పేదలకు ఇచ్చే సన్న బియ్యం కోసం రూ.14,560 కోట్లు ఖర్చు పెడుతున్నామని, అందులో కోతలు ఉండవని స్పష్టం చేశారు. రూ.500ల గ్యాస్ విధానంలో ఎలాంటి మార్పులు లేవని ఆయన తెలిపారు.
కేంద్రం సెస్ పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు రాష్ట్రానికి ఇవ్వడం లేదని, 34 శాతం మాత్రమే తిరిగి ఇస్తున్నారని సీఎం ఆరోపించారు. కేంద్రానికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రమే సెస్ ఇస్తున్నారని విమర్శించారు. తనకూ, కేసీఆర్కు పోలిక లేదని, ఎన్నికల వేళ తాము ఏం చెప్పామో అదే చేస్తున్నట్లు సీఎం తేల్చి చెప్పారు. కేసీఆర్ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదని ఎద్దేవా చేశారు.











