ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధులకు తెలియజేసే హక్కును హరించరాదని, నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలు చట్టవిరుద్ధమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన ఆయన, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఏర్పాటు చేసిన ఈ పెట్టెల ద్వారా ప్రజలను నేరుగా కలిసే అవకాశాన్ని తగ్గిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధులకు తెలియజేయడం మౌలిక హక్కని, ఫిర్యాదు పెట్టెల రూపంలో మధ్యవర్తిత్వ వ్యవస్థను తీసుకురావడం పారదర్శకత, జవాబుదారీ తత్వాన్ని తగ్గించే ప్రమాదం ఉందని చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ పెట్టెలు అధికారిక తపాలా పెట్టెలను పోలి ఉండటంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫిర్యాదు పెట్టెల ఏర్పాటు చట్టబద్ధత, పరిపాలనా అనుమతులపై సమగ్ర పరిశీలన జరిపించాలని, ప్రభుత్వ ఆస్తులపై ఏర్పాటు చేసిన వాటిని వెంటనే తొలగించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.












