కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం మహిళా అభివృద్ధికి ఆటంకం కలిగించడమేనని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆరోపించారు.
మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో పురోగమించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకువచ్చిందని, దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించడం అభ్యంతరకరమని గోదావరి అంజిరెడ్డి అన్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్, మహిళల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె విమర్శించారు.
రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్సభలో అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని, ఇది మహిళల హక్కులను కాలరాయడమేనని ఆమె ఆరోపించారు. సిద్దిపేటలో నారీశక్తి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అంజిరెడ్డి తెలిపారు. మహిళా బిల్లును అడ్డుకోవడం అంటే పుట్టబోయే బిడ్డను అడ్డుకున్నట్లేనని ఆమె అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు వ్యతిరేకంగా బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ, త్రిపుల్ తలాక్ రద్దు వంటి చర్యల ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం చేసిందని ఆమె గుర్తు చేశారు. జనధన్ ఖాతాలు, 'బేటీ బచావో, బేటీ పడావో', 'సుకన్య సమృద్ధి యోజన' వంటి పథకాల ద్వారా మహిళలకు అండగా నిలిచిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని ఆమె ప్రశంసించారు.












