తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. కేరళ ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు తెలంగాణలో అమలు కాని హామీలను అమలు చేసినట్లుగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని వారిని ప్రశంసిస్తున్న కాంగ్రెస్, కేరళలో మాత్రం వారిపై తీవ్ర విమర్శలు చేయడం వారి ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని ప్రసాదరావు పేర్కొన్నారు. ఇటీవల ఖమ్మం సభలో కమ్యూనిస్టుల పోరాటాల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని చెప్పిన రేవంత్ రెడ్డి, కేరళలో మాత్రం పినరయి విజయన్, ప్రధాని మోదీలను ఒకే తాటిపై పెట్టడం వారి రాజకీయ అస్థిరతకు నిదర్శనమని అన్నారు.
ఒకే పార్టీ రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనని, కాంగ్రెస్ జాతీయ నాయకులు కేరళలో ప్రచారం చేస్తున్నా, రేవంత్ రెడ్డి తానే “కేరళకు గ్యారంటీ” అని చెప్పడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. గతంలో కర్ణాటక నాయకులు తెలంగాణకు వచ్చి అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని, ఇప్పుడు తెలంగాణ నిధులను బీహార్, కేరళ ఎన్నికల కోసం వినియోగించడం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని ప్రసాదరావు విమర్శించారు.
తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500, “చేయూత” కింద రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు కాలేదని, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు, రైతులకు వడ్ల బోనస్ వంటి హామీలు కూడా అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. పెన్షన్లు పెంచకపోవడంతో పాటు సకాలంలో చెల్లింపులు జరగక వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక్కడ అమలు చేయని హామీలనే ఇప్పుడు కేరళలో ప్రకటిస్తూ అక్కడి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
“కరప్షన్ ఈజ్ కాంగ్రెస్ - కాంగ్రెస్ ఈజ్ కరప్షన్” అనే వ్యాఖ్యలను నిజం చేస్తూ, కాలేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు మూసీ ప్రాజెక్టును కమిషన్ల కోసం ఉపయోగిస్తున్నారని, 40% కమిషన్ల పాలన సాగుతోందని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, తెలంగాణ ప్రజల సొమ్మును పార్టీ ఫండింగ్ కోసం ఢిల్లీకి తరలిస్తున్నారని విమర్శించారు. మతపరమైన రాజకీయాలు చేస్తూ ముస్లిం లీగ్ వంటి పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ స్వభావాన్ని బయటపెడుతోందని, తెలంగాణలో అర్బన్ నక్సల్స్ ప్రభావంతో పాలన సాగిస్తూ ప్రజలను మోసం చేసి ఓట్లు సాధించారని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలోని అవినీతి, మోసాలు, కబ్జా రాజకీయాలను తెలుసుకోవాలంటే కేరళ ప్రజలు తెలంగాణకు వచ్చి వాస్తవ పరిస్థితులు చూడాలని సూచించారు. బీజేపీకి స్పష్టమైన జాతీయ సిద్ధాంతం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతరహితంగా కుట్రలతో నిండిన పార్టీగా మారిందని అన్నారు.










