తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)' పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. అమ్మనై ప్రజలకు పాలన అందిస్తానని, ఉచిత విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం తమ పార్టీ పంచ సూత్రాలని ఆమె తెలిపారు.
మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో జరిగిన భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత నూతన పార్టీని ప్రకటించారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి, సామాజిక న్యాయ సాధనకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వాన్ని, ఇతర ప్రధాన పార్టీలను కవిత తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను కర్కోటక, నియంతృత్వమని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అజెండాలను విశ్లేషిస్తూ, తమ పార్టీ ఈ మూడింటికీ భిన్నంగా ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తామని, రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజల పక్షాన నిలిచిన కేసీఆర్, ఇప్పుడు 'ఆత్మలేని మరబొమ్మ'గా మారారని, గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో బందీ అయ్యారని ఆరోపించారు. తెలంగాణ సాధన లక్ష్యాలు నెరవేరలేదని, ప్రజల ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని విమర్శించారు.
పార్టీ ప్రకటన సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించి, భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. 'పాంచజన్యం' పేరుతో ఐదు కీలక హామీలను కవిత వివరించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి కల్పన, లక్షల్లో ఉద్యోగాల భర్తీ, సామాజిక న్యాయం తమ పార్టీ అజెండాలో ప్రధానాంశాలని తెలిపారు.











