తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్భావ సభకు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి అభిమానులు మంగళవారం పాదయాత్రను ప్రారంభించారు. ఈనెల 25న కవిత నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ పాదయాత్ర చేపట్టారు.
తెలంగాణ జాగృతి నాయకులు వినయ్, సతీశ్ ల ఆధ్వర్యంలో వంద మంది నాయకులు, కార్యకర్తలు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి మంగళవారం ఉదయం పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ యాత్ర పార్టీ ఆవిర్భావానికి సంఘీభావం తెలిపేలా కొనసాగుతోంది.
పాదయాత్ర బృందం మంగళవారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. అక్కడ రాత్రి బస చేసి, బుధవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి యాత్రను ముందుకు తీసుకువెళ్తారు. మార్గమధ్యంలో వివిధ ప్రాంతాల్లో నాయకులు, ప్రజలు వారికి స్వాగతం పలుకుతున్నారు.
యాత్ర చివరి గమ్యస్థానం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మునీరాబాద్ లో గల అద్వయ కన్వెన్షన్ సెంటర్. ఇక్కడ శనివారం ఉదయం పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది.











