కామారెడ్డి జిల్లా డీసీసీ కార్యాలయంలో శుక్రవారం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు యువత, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఇంద్రనగర్ కాలనీకి చెందిన సుమారు 40 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలే బలం అని, కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కొత్తగా చేరిన కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ విజయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












