పెట్రోల్, డీజిల్ ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు. అంతర్జాతీయ కారణాల వల్ల ధరల పెంపు అనివార్యమైందని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును రాజకీయంగా వాడుకుంటున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం లేదని, అందువల్లే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలు ఆయా పార్టీల నాయకుల మాటలు విని మోసపోవద్దని ఆయన సూచించారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగాయని, ఈ పెంపు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ప్రభావం వల్లనే ఈ ధరల పెంపు అనివార్యమైందని ఆయన వివరించారు. ఇది ప్రజలపై భారం వేయడానికి కాదని, క్రూడాయిల్ దిగుమతికి భారీగా ఖర్చు అవుతుండటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ లీటర్‌పై రూ.3కు పైగా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరల పెంపు వల్ల ప్రజలపై అదనపు భారం పడుతుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, అంతర్జాతీయ పరిణామాల వల్లనే ధరల పెంపు అనివార్యమైందని, దీనిని రాజకీయంగా వాడుకోవద్దని పేర్కొన్నారు.











