దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మహిళలకు నిర్ణయాధికారం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ బిల్లు దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ఆయన అన్నారు.
30 ఏళ్ల క్రితం ఆమోదం పొందాల్సిన ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్ ముందుకు వచ్చిందని, మహిళా సాధికారత తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని, కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడాన్ని ప్రధాని ప్రశంసించారు. గత 30 ఏళ్ల రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, మహిళలకు అండగా నిలిచే పార్టీలకే ప్రజలు పట్టం కట్టారని, ఇది రుజువైందని ఆయన అన్నారు.
పంచాయతీ స్థాయితో పాటు లోక్సభ, శాసనసభల్లోనూ మహిళల భాగస్వామ్యం అవసరమని, మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అత్యున్నత చట్టసభల్లోనూ మహిళలు తమ గళం వినిపించాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
ఈ బిల్లు అమలుతో దేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని, మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరిగి సమానత్వానికి దారితీస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.











