రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అడుగుపెట్టిన ప్రతి చోట విధ్వంసమే మిగిలిందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, పరిశ్రమలు తరలిపోయాయని, యువతకు ఉద్యోగాలు కరువయ్యాయని ఆయన ఆరోపించారు.
గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు, వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తల్లి, సోదరిని గౌరవించని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులకు విలువ లేకుండా పోయిందని, సంక్షేమం పేరుతో అప్పుల భారం పెంచి రాష్ట్రాన్ని బలహీనపరిచారని విమర్శించారు.
అభివృద్ధి కేవలం మాటల్లోనే మిగిలిపోయిందని, వాస్తవంలో విధ్వంసం స్పష్టంగా కనిపించిందని మంత్రి వ్యాఖ్యానించారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం స్వర్ణయుగాన్ని చూసిందని, కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించి, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ కు గట్టిగా బుద్ధి చెప్పారని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఘన విజయం అందించారని అచ్చెన్నాయుడు తెలిపారు. కేవలం 22 నెలల్లోనే రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి, అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు.
మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని, ప్రజల ఆశలను, రైతుల త్యాగాలను తాకట్టు పెట్టారని జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ ను ఆయన పార్టీ వాళ్లే జోకర్లా చూస్తున్నారని, నిమిషానికి ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడే వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన ప్రజలు ఇక జీవితంలో జగన్ కు మరో అవకాశం ఇవ్వబోరని స్పష్టం చేశారు.











