లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్, టీఎంసీ కుమ్మక్కయ్యాయని, దీనిని మహిళలకు జరిగిన అన్యాయంగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిష్ణుపూర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు, దేశాభివృద్ధికి రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం కీలకమని కేంద్రం భావిస్తోందని తెలిపారు. అయితే, బెంగాల్ తల్లులు, చెల్లెళ్లను టీఎంసీ మోసం చేసిందని, మహిళలకు దక్కాల్సిన హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.
బెంగాల్ మహిళలు 33 శాతం రిజర్వేషన్ కోరుకుంటున్నారని, 2029 నుంచి అమలు చేయాలన్న వారి ఆకాంక్షను నెరవేర్చడానికి కేంద్రం ప్రయత్నించిందని చెప్పారు. అయితే, తమ అధికారాన్ని సవాలు చేస్తారనే భయంతో టీఎంసీ, కాంగ్రెస్ కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయని విమర్శించారు.
బీజేపీ మహిళా సాధికారత, భద్రతకు కట్టుబడి ఉందని, అందుకే మహిళల నుంచి నిరంతర మద్దతు లభిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని తెలిసే ప్రజలను టీఎంసీ బెదిరిస్తోందని, 'టీఎంసీ గూండాలు' లొంగిపోవాలని, లేకుంటే ఎన్నికల ఫలితాల తర్వాత ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
కాంగ్రెస్, టీఎంసీలు గిరిజన వ్యతిరేకులని, రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన అభ్యర్థి ద్రౌపది ముర్మును వ్యతిరేకించారని విమర్శించారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఉచిత రేషన్ అందిస్తామని, ప్రజల రేషన్‌ను ఎవరూ అడ్డుకోలేరని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరిగి, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.











