ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో, ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలుకుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు శుక్రవారం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జరగనున్న సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని తెలిపారు.
ఈ సభకు రెండు లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని రామచందర్రావు అంచనా వేశారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సభ తమ పార్టీకి కలిసి వచ్చే అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని రామచందర్రావు ఉద్ఘాటించారు.
సభకు వచ్చే కార్యకర్తల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా సభ విజయవంతం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. సభా ప్రాంతం రెండు రోజులపాటు కేంద్ర బలగాల అధీనంలో ఉంటుందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి సభ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని, ఈ పర్యటన తెలంగాణలో బీజేపీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.











