హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిష్కళంకుడినని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. సుమారు 40 రోజుల తర్వాత ఆదివారం ఏలూరులో అడుగుపెట్టిన ఎంపీకి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
శాంతినగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ, తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పని అన్నారు. డ్రగ్స్ కేసు విచారణలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేసు విచారణ దశలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని, మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తనపై వచ్చిన కథనాలతో మనస్థాపానికి గురయ్యానని, అయితే జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు పార్లమెంటు అభివృద్ధికి అంకితమై పని చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు.
గన్నవరం విమానాశ్రయంలో ఎంపీకి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే అభిమానులు పూల వర్షం కురిపించారు. వారి ప్రేమాభిమానాలకు ఎంపీ భావోద్వేగానికి గురయ్యారు. గన్నవరం నుంచి ఏలూరు వరకు సుమారు 300కు పైగా కార్లతో భారీ ర్యాలీగా ఎంపీ బయలుదేరారు.











