పెళ్లకూరు మండల తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన సీనియర్ నాయకులు, చిల్లకూరు నివాసి పాపాడి రాజగోపాల్ రెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.
సుమారు 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న రాజగోపాల్ రెడ్డి, పార్టీ స్థాపన నుంచి సేవలందించారు. ఆయన 1997లో ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి గెలుపులోనూ కీలక పాత్ర పోషించారు. 2005లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. రెండుసార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
రాజకీయాల్లో తగిన గుర్తింపు లభించలేదనే ఆవేదనతోనే రాజీనామా చేసినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. పార్టీలో పనిచేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు చేయలేని పరిస్థితి నెలకొందని, దశాబ్దాలుగా సేవలందించిన వారికి సముచిత స్థానం లభించడం లేదని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో వివరించారు.
ఒక సీనియర్ నాయకుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడి రాజీనామా మండల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన తదుపరి రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పరిణామం స్థానిక టీడీపీ వర్గాల్లో కలకలం సృష్టించింది.











