ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణను ఆమె తీవ్రంగా ఖండించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో "ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది" అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫార్మా సిటీ భూసేకరణ కోసం తెచ్చిన జీవో 31 ను రద్దు చేయాలని కోరారు. గత ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవే అబద్ధాలను కొనసాగిస్తోందని ఆమె విమర్శించారు. ఫార్మా సిటీ భూముల విషయంలో తెలంగాణ రక్షణ సేనయే ముందుండి బాధితుల తరఫున కొట్లాడుతుందని ఆమె చెప్పారు.
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రైతులకు వెంటనే ఇచ్చేయాలని కవిత అన్నారు. రైతుల అంగీకారం లేకుండానే వారి భూములను సేకరించారని ఆమె మండిపడ్డారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ లో భూముల సేకరణ కోసం జీవో 31ను తీసుకొచ్చిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తామని చెప్పి...అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేస్తుందని ఆమె ఆరోపించారు. జీవో 31 రద్దు చేయకపోగా, ఫ్యూచర్ సిటీ పేరుతో భూ సేకరణను 13,500 ఎకరాల నుంచి 30 వేల ఎకరాలు చేశారని ఆమె తెలిపారు.
కందుకూరు మండలంలో 3500 ఎకరాలు, యాచారం మండలంలో 6500 ఎకరాలు అసైన్డ్ భూమే ఉందని, వాటికి సంబంధించి కోర్టులో స్టే ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కచేయలేదని కవిత విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అబద్ధాలు చెబుతూ కోర్టును, ప్రజలను మోసం చేస్తోందని ఆమె అన్నారు. కోర్టులో ఫార్మా సిటీ కొనసాగిస్తామని చెబుతూనే, బయట మాత్రం రేవంత్ సర్కార్ ఫ్యూచర్ సిటీ కోసం ఈ భూముల సేకరణ మొదలు పెట్టిందని ఆమె విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగనిచ్చేది లేదని ఆమె తేల్చిచెప్పారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలందరినీ మోసం చేస్తోందని కవిత అన్నారు. బుల్లెట్ ట్రైన్, 6 లక్షల కోట్ల ఎంఓయూలు, డేటా సెంటర్ల పేరుతో అబద్దాల పునాదుల మీద ప్యూచర్ సిటీ నిర్మాణం చేయాలనుకుంటున్నారని ఆమె చెప్పారు. డేటా సెంటర్ల పేరుతో ప్రజలను కాలుష్యం కోరల్లోకి నెట్టేస్తారా అని ప్రశ్నించారు. డేటా సెంటర్ల ద్వారా వచ్చే శబ్దానికి పక్షులు బతికే పరిస్థితి ఉండదని, వాటి కారణంగా వచ్చే నష్టాన్ని ఇప్పటి వరకు ఎవరు అంచనా వేయలేదన్నారు. ఎకరాకు రూ.8 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని అంటే వారి బతుకుదెరువు పరిస్థితి ఏమిటని కవిత ప్రశ్నించారు. అలాగే, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఎత్తివేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని, మొన్నటి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఆ విషయం కూడా బయటికి చెప్పలేదని ఆమె తెలిపారు. వచ్చే ఏడాది నుంచి పంట కొనుగోళ్లు ఉండవని, అందుకోసం ముగ్గురు మంత్రులతో రేవంత్ రెడ్డి కమిటీ వేశారని కవిత చెప్పారు.











