తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అణచివేయబడుతోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలపై నిలదీస్తే అరెస్టులు చేయడం ప్రభుత్వ దుర్మార్గమని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామచందర్ రావు, బీజేపీ కార్యకర్తలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ గళం వినిపించే వారిని అణచివేసే ప్రయత్నాలను బీజేపీ సహించదని ఆయన స్పష్టం చేశారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బండి సంజయ్ పేర్కొన్నారు. తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.







