ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత దేశాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని క్రిసెంట్ గేటెడ్ కమ్యూనిటీ వాసులతో సీనియర్ సిటిజన్ ఫోరం రమేష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్అండ్ గ్రీట్ కార్యక్రమంలో రామచందర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యావంతులు సమాజంలో మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందిందని, 12 ఏళ్ల క్రితం 12వ స్థానంలో ఉన్న దేశం ప్రస్తుతం 4వ స్థానంలో ఉందని రామచందర్‌రావు తెలిపారు. 2014లో రూ.106.57 లక్షల కోట్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుతం రూ.331.03 లక్షల కోట్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధిలో దేశం ఎంతో ముందుందని, ఈ విషయాన్ని విద్యావంతులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని రామచందర్‌రావు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్‌యాదవ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణయాదవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.











