కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన సుస్థిరాభివృద్ధి గణాంకాల విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. వాస్తవ గణాంకాలతో కూడిన లేఖను విడుదల చేస్తూ, మలయాళంలోనే విజయన్‌కు చురక అంటించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 'ఎక్స్' వేదికగా తెలంగాణ సుస్థిరాభివృద్ధిలో ఆరో స్థానంలో ఉందని చేసిన విమర్శలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ పోలిక అసంబద్ధమని పేర్కొంటూ, వాస్తవ గణాంకాలతో కూడిన ఆరు పేజీల లేఖను ఆయన విడుదల చేశారు. విజయన్ ఆరోపణలను తిప్పికొడుతూ, మలయాళంలోనే ఆయనకు సూటిగా సమాధానం ఇచ్చారు.
విజయన్ తన ఆరోపణలకు ఉపయోగించిన గణాంకాలు 2023-24 కాలానికి సంబంధించినవని, అవి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చివరి దశలోనివని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కేరళలో విజయన్ ప్రభుత్వం 120 నెలలుగా అధికారంలో ఉండగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 28 నెలలే అధికారంలో ఉందని ఆయన పేర్కొన్నారు. 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని తమ 28 నెలల పాలనతో పోల్చడం సీనియర్ నేత స్థాయికి తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
గత 60 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాల కృషి, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న విదేశీ మారకద్రవ్యం వల్లే కేరళలో పేదరికం తగ్గిందని, ఆ ఘనత కేవలం ఎల్డీఎఫ్ ప్రభుత్వానిది కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు మాత్రమే కాగా, అందులో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కేంద్రంలో బీజేపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్లే రాష్ట్రంలో పేదరికం 5.88 శాతంగా నమోదైందని ఆయన వివరించారు.
తాను ఏప్రిల్ 7న తిరువనంతపురం వచ్చి, తమ ప్రభుత్వ 28 నెలల విజయాలను వ్యక్తిగతంగా వివరిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. కేరళ ఎదుర్కొంటున్న మేధోవలసలు, పారిశ్రామిక స్తబ్దత వంటి సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. "కేరళ ప్రజలు నాకు నేర్పిన మాటను ఇప్పుడు పూర్తి ఆప్యాయతతో మీకు చెబుతున్నాను.. నీ పో, మోనే విజయన్! (వెళ్లు అబ్బాయ్ విజయన్!)" అంటూ రేవంత్ రెడ్డి తన లేఖను ముగించారు.











